31
1 ఇదంతా అయిపోయిన తరువాత అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలంతా యూదా పట్టణాలకు వెళ్లి, విగ్రహాలను ముక్కలు ముక్కలు చేసి, అషేరా దేవతాస్తంభాలను విరగగొట్టి, యూదా బెన్యామీను దేశాలంతటా ఉన్నఉన్నత పూజా స్థలాలను, బలిపీఠాలను, పడగొట్టారు. తరువాత ఎఫ్రాయిమూ, మనష్షే ప్రాంతాల్లో కూడా ఇలానే పూర్తిగా నాశనం చేశారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా తమ తమ పట్టణాలకూ, గ్రామాలకూ తిరిగి వెళ్లిపోయారు.
హిజ్కియా సంస్కరణలు
31:20-21; 2రాజులు 18:5-7
2 హిజ్కియా యాజకులకూ, లేవీయులకూ వారి వారి సేవాధర్మం ప్రకారం, వారి వారి వరసలు నియమించాడు. దహనబలులూ సమాధాన బలులూ, శాంతి బలులూ అర్పించడానికీ, ఇతర సేవలూ చేయడానికీ యెహోవా మందిర గుమ్మాల దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికీ, స్తుతులు చెల్లించడానికీవారిని నియమించాడు.
3 యెహోవా ధర్మశాస్త్రంలో రాసినట్టుగా ఉదయ సాయంత్రాలు అర్పించవలసిన దహనబలుల కోసం విశ్రాంతిదినాలకూ, అమావాస్యలకూ నియామక కాలాలకూ అర్పించవలసిన దహనబలుల కోసం తన సొంత ఆస్తిలోనుంచి రాజు ఒక భాగాన్ని ఏర్పాటు చేశాడు. 4 యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం యాజకులూ, లేవీయులూ తమ పని శ్రద్ధగా జరుపుకొనేలా, వారికి చెందవలసిన భాగం ఇవ్వాలని యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకు అతడు ఆజ్ఞాపించాడు.
5 ఆ ఆజ్ఞ జారీ అయిన వెంటనే ఇశ్రాయేలీయులు తమ మొదటి పంట ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె, తేనె, పొలంలోని పంటనూ విస్తారంగా తీసుకు వచ్చారు. అంతే కాక అన్నిటిలోనుంచి పదవ వంతును విస్తారంగా తెచ్చారు.
6 యూదా పట్టణాల్లో నివసిస్తున్న ఇశ్రాయేలువారు, యూదావారు ఎద్దులు గొర్రెల్లో పదవవంతు, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితమైన వస్తువుల్లో పదవ వంతు తీసుకు వచ్చి కుప్పలుగా పోశారు. 7 వారు మూడవ నెలలో కుప్పలు వేయడం మొదలుపెట్టి ఏడవ నెలలో ముగించారు. 8 హిజ్కియా, అతని అధికారులూ వచ్చి ఆ కుప్పలను చూసి యెహోవాను స్తుతించి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను దీవించారు.
9 హిజ్కియా ఆ కుప్పలను గురించి యాజకులను లేవీయులను ప్రశ్నించాడు. సాదోకు సంతతివాడు ప్రధానయాజకుడైన అజర్యా అతనికి ఇలా జవాబిచ్చాడు. 10 “యెహోవా మందిరంలోకి ప్రజలు కానుకలు తీసుకురావడం మొదలుపెట్టినప్పటి నుంచి మేము సమృద్ధిగా భోజనం చేసినా ఇంకా చాలా మిగిలి పోతున్నది. యెహోవా తన ప్రజలను ఆశీర్వదించినందుకు ఇంత గొప్పరాశి మిగిలింది.”
11 హిజ్కియా యెహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచాలని ఆజ్ఞ ఇచ్చాడు. 12 తరువాత వారు కానుకలనూ పదవ భాగాలనూ ప్రతిష్ట చేసిన వస్తువులనూ నమ్మకంగా లోపలకు తెచ్చారు. లేవీయుడైన కొనన్యా వాటికి నిర్వహణాధికారి. అతని సోదరుడైన షిమీ అతనికి సహకారి. 13 యెహీయేలు, అజజ్యా, నహతు. అశాహేలు, యెరీమోతు, యోజాబాదు, ఎలీయేలు, ఇస్మక్యా, మహతు, బెనాయా అనేవారు కొనన్యా చేతి కింద, అతని సోదరుడు షిమీ చేతి కింద తనిఖీ చేసేవారుగా ఉన్నారు. రాజైన హిజ్కియా దేవుని మందిరానికి అధికారిగా ఉన్న అజర్యా వారిని నియమించారు.
14 తూర్పువైపు గుమ్మం దగ్గర పాలకుడూ లేవీయుడైన ఇమ్నా కొడుకు కోరే, దేవునికి సమర్పించిన స్వేచ్ఛార్పణల మీద అధికారి. ప్రజలు యెహోవాకు తెచ్చిన కానుకలనూ ప్రతిష్టిత వస్తువులనూ పంచిపెట్టడం అతని పని. 15 అతని చేతి కింద ఏదెను, మిన్యామీను, యేషూవ, షెమయా, అమర్యా, షెకన్యా అనేవారున్నారు. వారు నమ్మకమైనవారు కాబట్టి యాజకుల పట్టణాల్లో ప్రముఖులనీ సామాన్యులనీ తేడా లేకుండా తమ సోదరులకు వరస క్రమాల ప్రకారం వారి భాగాలను పంచిపెట్టడానికి వారిని నియమించారు.
16 అంతేకాక మూడేళ్ళు మొదలు అంతకు పైవయసుండి వంశవృక్షాల్లో నమోదైన మగపిల్లలకు కూడా వంతుల ప్రకారం పంచిపెట్టారు. వారి వారి వరసల ప్రకారం బాధ్యతల ప్రకారం సేవచేయడానికి ప్రతిరోజూ యెహోవా మందిరంలోకి వచ్చేవారందరికీ పంచిపెట్టారు. 17 ఇరవై ఏళ్ళు మొదలు అంతకు పై వయసుండి వంతుల ప్రకారం సేవచేయడానికి తమ తమ పూర్వీకుల వంశాల ప్రకారం యాజకుల్లో సరిచూడబడిన లేవీయులకు పంచిపెట్టారు.
18 అంటే నమ్మకమైనవారై తమ్మును ప్రతిష్ఠించుకునిన లేవీయులకు తమ పిల్లలతో భార్యలతో కొడుకులతో కూతుర్లతో 19 సమాజమంతా సరిచూడబడినవారికి, ఆ యా పట్టణాలకు చేరిన గ్రామాల్లో ఉన్న అహరోను వంశస్థులైన యాజకులకు, వంతులు ఏర్పరచడానికి వారిని నియమించారు. పేరుల ప్రకారం చెప్పబడిన ఆ ప్రజలు యాజకుల్లో పురుషులందరికి, లేవీయుల్లో వంశాల ప్రకారం సరిచూడబడిన వారందరికి వంతులు ఏర్పరచడానికి వారిని నియమించారు.
20 హిజ్కియా యూదా దేశమంతటా ఇలా జరిగించాడు. తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా యధార్థంగా నమ్మకం గా ప్రవర్తించాడు. 21 దేవుని మందిర సేవకోసం, ధర్మశాస్త్రం కోసం, ఆజ్ఞల కోసం మొదలుపెట్టిన ప్రతి పనిలో అతడు తన దేవుణ్ణి వెతికి అనుసరించాడు. హృదయపూర్వకంగా అనులు జరిగించాడు గనక వర్ధిల్లాడు.